Tata’s Eye on Vizag Steel | విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు తెలుగువారు.. ఉద్యమించి.. ఉక్కు సంకల్పంతో సాధించుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల్లో భాగంగా ప్రైవేటీకరణ దిశగా.. కార్పొరేట్ సంస్థల హక్కుభుక్తం కాబోతున్నది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీగా పేరొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్). ప్రస్తుతం ఉక్కు మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.
విశాఖ ఉక్కు టేకోవర్‌కు రెడీ.. టాటా స్టీల్
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని టేకోవర్ చేసుకునేందుకు ఆసక్తితో ఉన్నట్లు ప్రకటించింది ప్రముఖ దేశీయ సంస్థ టాటా స్టీల్. టాటా స్టీల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) కం మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ ఈ సంగతిని ధ్రువీకరించారు.
జనవరి 17న సీసీఈఏ ఇలా సూత్రప్రాయ ఆమోదం
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ (ఆర్ఐఎన్ఎల్)లో 100 శాతం వాటాలను ఉపసంహరించాలని ఈ ఏడాది జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణ, వాటాల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల నిధులు సమకూర్చుకోవాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే.
దక్షిణాసియా.. తూర్పు ఆసియాల్లో విస్తరణ
దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో తమ విస్తరణకు విశాఖ స్టీల్స్ టేకోవర్ ఉపకరిస్తుందని నరేంద్రన్ పేర్కొన్నారు. 7.3 మిలియన్ల మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉంది.. దీంతోపాటు గంగవరం పోర్ట్ వరకు రవాణాకు 22 వేల ఎకరాల భూమి విశాఖ ఉక్కు ఆధీనంలో ఉండటం గమనార్హం. సౌతాసియా, ఈస్ట్ ఆసియా మార్కెట్లలో విస్తరణకు విశాఖ ఉక్కు ఉపకరిస్తుందని టాటా స్టీల్ భావిస్తున్నది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..