ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీలో జాతీయ పతాకంతో నిరసన తెలుపుతున్న వారిపై తాలిబన్లు కాల్పులు జరిపారు. దీంతో పలువురు మృతి చెందారు. అసాదాబాద్ నగరంలో గురువారం ఈ ఘటన జరిగింది. బుధవారం జలాలాబాద్‌లోనూ జాతీయ జెండా విషయంలో నిరసన తెలపగా.. తాలిబన్ల కాల్పుల్లో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులు వారి జెండాలను చించేస్తూ.. ఆఫ్ఘన్ జెండాలను ప్రదర్శిస్తున్నారు.
గురువారం కూడా అసాదాబాద్‌లో తాలిబన్లకు వ్యతిరేకంగా జాతీయ జెండాలతో నిరసన తెలుపుతున్న సమయంలో తాలిబన్లు ఫైరింగ్ జరిపారు. అయితే అదే సమయంలో తొక్కిసలాట జరిగింది. దీంతో మరణాలు ఫైరింగ్ వల్ల జరిగాయా లేక తొక్కిసలాట వల్లనా అన్నది తెలియదని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అసాదాబాద్‌లో వందల మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపినట్లు ఆ వ్యక్తి చెప్పారు.