- సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీగా ఎన్‌ఐఏబీ
- నోటిఫికేషన్ జారీచేసిన కేంద్ర ప్రభుత్వం
- ఫలించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ కృషి
హైదరాబాద్‌లో ‘వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్’ను ఏర్పాటు చేయాలన్న మంత్రి కేటీఆర్ కృషి ఫలించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ)ని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీగా గుర్తిస్తూ కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ శనివారం నోటిఫికేషన్ జారీచేసింది. దాంతో ఇకపై టీకాల పరీక్షలు ఇక్కడే జరుగనున్నాయి. వ్యాక్సిన్ల పరీక్షలు, అనుమతుల్లో వేగం పెరుగనున్నది. కొవిడ్-19 టీకాలు సైతం తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. వ్యాక్సిన్ టెస్టింగ్‌లో సమయం, రవాణా వ్యయం అదా కానున్నాయి. ఎన్‌ఐఏబీతోపాటు పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్‌కు కేంద్రం సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీగా గుర్తింపు ఇచ్చింది. ఈ రెండు ల్యాబ్‌లు నెలకు 60 బ్యాచ్‌ల వ్యాక్సిన్లను పరీక్షిస్తాయని అంచనా.
కేటీఆర్ అవిరళ కృషి
ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలిలో మాత్రమే వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఉన్నది. దేశంలో తయారైన వ్యాక్సిన్లను అక్కడే పరీక్షించి అనుమతులు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కసౌలి సుమారు 1,800 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ ఉత్పత్తి అయిన టీకాలను పరీక్షలకు తీసుకెళ్లి, రావడానికి 30-45 రోజులు పడుతున్నది. ఫలితంగా అత్యంత విలువైన కాలం వృథా అవుతున్నది. ఈ ప్రభావం కరోనా టీకాలపై కూడా పడింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా వెలుగొందుతున్న హైదరాబాద్‌లో టీకా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కొన్నేండ్లుగా కేంద్రాన్ని కోరుతున్నారు. సాధారణ టీకాలతోపాటు కొవిడ్ టీకాల అభివృద్ధి, ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్‌లో సెంట్రల్ డ్రగ్ ల్యాబ్ ఏర్పాటు ఆవశ్యతను వివరిస్తూ అప్పటి కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, సదానంద గౌడకు రెండుసార్లు లేఖలు రాశారు. ఈ విషయం ఈ ఏడాది జనవరిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి వెళ్లగా, తెలంగాణ విన్నపాన్ని పరిశీలించాలని హర్షవర్ధన్‌కు సూచించారు. ఈ ప్రయత్నాలన్నీ ఫలించి ఎన్‌ఐఏబీని సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీగా గుర్తిస్తూ ఈ నెల 17న కేంద్ర ఆరోగ్యశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదలచేసింది.