తెలంగాణ ముఖ్యాంశాలు

జీవో 111పై వైఖరి తెలపండి

ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాశయాల పరివాహక ప్రాంతాల పరిరక్షణ జీవో 111పై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని హైకోర్టు కోరింది. వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లలో గల ప్రైవేట్‌ భూములు ఈ జీవో పరిధిలోకి రావంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వ్వకేట్‌ జనరల్‌ జే రామచంద్రరావు వాదన వినిపిస్తూ.. కోకాపేట భూములకు వట్టినాగులపల్లి భూములకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఈపీటీఆర్‌ఐ) నివేదిక ప్రకారం 87 పార్సిళ్లలో 377 మంది భూ యజమానుల వద్ద 948 ఎకరాలున్నాయని తెలిపారు. వీటి వివరాలను, పహాణీలతో సహా ప్రస్తుతం అందుబాటులో ఉన్న తెలుగు ప్రతులను కోర్టుకు అందజేశామని, బుధవారం నాటికి వీటిని ఇంగ్లిష్‌లో తర్జమా చేసి ఇస్తామని చెప్పారు. హెచ్‌ ఎండీఏ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌ నిరంజన్‌రెడ్డి వాదన వినిపిస్తూ.. కోకాపేటలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించినా అవన్నీ నిబంధనలకు అనుగుణంగానే ఉంటాయని, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. మౌలిక వసతుల కోసం రూ.268 కోట్లు, మరుగునీటి శుద్ధి కేంద్రానికి రూ.80 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. పర్యావరణ, మురుగునీటి శుద్ధి కేంద్రాల కోసం 135, 168 జీవోలను అమలు చేస్తేనే నిర్మాణాలకు అనుమతులు ఉంటాయని తామిచ్చిన హామీని హైకోర్టు రికార్డుల్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దీంతో జీవో 111పై ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని హైకోర్టు కోరుతూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ విచారణకు ప్రభుత్వ ఉన్నతాధికారితోపాటు హెచ్‌ఎండీఏ అధికారి హాజరుకావాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.