కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ చీడ పురుగని ఆయనను ఎన్ని తిట్టినా దండగేనని అన్నారు. బుధవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెలంగాణ భవన్ మంత్రి సీ మల్లారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు.
ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ‘నేనెవరి నుంచి భూములను లాక్కోలేదు. రాజకీయాల్లోకి రాకముందే భూములు కొనుగోలు చేశా. రేవంత్ రెడ్డి ఓ దొంగ.. కబ్జాకోరు. మూడు చింతలపల్లిలో రూ. 62 కోట్లతో సీఎం కేసీఆర్ అన్ని రకాల అభివృద్ధి పనులు చేశారు. మూడు చింతలపల్లిని మండలంగా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వమే. మూడు చింతలపల్లిలో సమస్యలు లేవు కాబట్టే రేవంత్‌ను రావొద్దు అని అక్కడి ప్రజలు ప్లకార్డులు చూపించారు. మూడు చింతలపల్లిలో జరిగిన అభివృద్ధి కొడంగల్‌లో జరిగిందా.? రేవంత్ రెడ్డి చెప్పాలి.
మల్లారెడ్డి ఎపుడూ బ్రోకర్ దందా చేయలేదు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నా. బ్రోకరిజం చేసి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడు. మల్లారెడ్డి కళాశాలకు పార్లమెంటే క్లీన్ చీట్ ఇచ్చింది. నేను కబ్జా చేసినట్లు రేవంత్ నిరూపించాలి!. రేవంత్ రెడ్డి అప్పుడే సీఎం అయినట్లు మొదటి సంతకాలంటూ వాగ్ధానాలు చేస్తుండు. తెలంగాణలో అమలవుతున్నన్ని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడైనా ఉంటే నా పదవికి రాజీనామా చేస్తా.
కాంగ్రెస్ పార్టీ దివాళా తీసింది. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏంటో రేవంత్ చెప్పాలి. రేవంత్ రెడ్డి మూడు చింతలపల్లి సభ పెట్టినందుకు దళితులు తిడుతున్నారు. రేవంత్ రెడ్డి ఖబడ్ధార్ ఇక రేపటి నుంచి చూసుకుంటా!. భూములను నా జేబులో పెట్టుకోని తిరుగుతలె. ఆన్‌లైన్‌లో చూస్తే అసైన్డ్ ల్యాండా.? కాదా.! అనేది తెలుస్తుంది. కావాలంటే చూసుకో రేవంత్ రెడ్డి. ఇద్దరం రాజీనామా చేద్దాం. మళ్లీ నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.