జాతీయం ముఖ్యాంశాలు

సాంకేతిక అంతరాల్లేని అంతర్జాల విద్య రావాలి: వెంకయ్యనాయుడు

అంతర్జాల విద్య, దూరవిద్యలో సమగ్ర విద్యావిధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నదని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు సూచించారు. సమాజంలో ఉన్న సాంకేతిక అంతరాలను తొలగించి, సాంకేతిక వారధులను నిర్మించడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమానమైన విద్యావకాశాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాలను మరింత మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఉన్నదని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వ చేపట్టిన భారత్ నెట్ కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా అమలుపరచాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపన దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు. సామాజిక, ప్రాంత అభివృద్ధితోపాటు దేశ ఆర్థికాభివృద్ధిలో ఉన్నతవిద్య కీలకపాత్ర పోషిస్తున్నదని అన్నారు. భారతదేశ విశ్వవిద్యాలయాల ప్రపంచీకరణ జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులు కూడా వివిధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని సూచించారు. భారతీయ భాషల్లో ఆన్‌లైన్ కోర్సుల కొరతను ప్రస్తావిస్తూ, ఎడ్యుటెక్ రంగంలోని ప్రైవేటు సంస్థలు, ప్రాంతీయ భాషల్లో కోర్సుల రూపకల్పనకు నడుం బిగించాలన్నారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం ద్వారా భారతీయ విద్యారంగంలో పరిపూర్ణమైన మార్పులు రానున్నాయని వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో పోతన పద్యాన్ని ఉదహరిస్తూ విద్య గొప్పతనాన్ని తెలియజేసిన కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి డాక్టర్‌ సుభాష్ సర్కార్‌ను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్య, విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్ఏ కోరితోపాటు అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.