కేరళలో కరోనా (Kerala Covid) కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూ ఆగస్టు 30 వ తేదీ నుంచి రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం ప్రకటించారు. అధిక సానుకూలత ఉన్న ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కేంద్రం సూచించిన రెండు రోజుల తర్వాత కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
రాష్ట్రంలో శనివారం 31,265 కొత్త కరోనావైరస్ కేసులు నమోదవగా.. గత 24 గంటల్లో 153 మంది చనిపోయారు. 21,468 మంది వివిధ దవాఖానల నుంచి డిశ్చార్జి కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 2,04,896 కి చేరుకున్నాయి.
‘కేరళలో సెరోపోజిటివిటీ రేటు తక్కువగా ఉన్నది. 2.03 కోట్ల మందికి మొదటి టీకా, 74 లక్షల మందికి రెండవ డోసు లభించింది. 57.6 శాతం మందికి మొదటి డోస్ ఇచ్చారు. అలాగే, 20.93 శాతం మంది రెండో డోసు టీకాలు పొందారు. ఈ సంఖ్యలు జాతీయ సంఖ్యల కంటే చాలా ఎక్కువ. 18 ఏండ్ల వయసు పైబడిన వారందరికీ సెప్టెంబరు నాటికి మొదటి మోతాదు టీకా వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 60 ఏండ్లు పైబడిన దాదాపు 9 లక్షల మంది, సహ వ్యాధిగ్రస్తులు వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. అవగాహన పెంచడానికి, టీకాలు వేసేందుకు వారిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నాం’ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. కేరళలో డెల్టా వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నందునే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. వీలైనంత ఎక్కువ పరీక్షలు చేయించడంపైనే దృష్టి పెట్టామన్నారు. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలకు బదులుగా యాంటిజెన్ టెస్టులు చేయిస్తున్నట్లు విజయన్ వెల్లడించారు.