పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరణాలు జిల్లాలో జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. ఈ ఏడాది జూలైలో పశ్చిమ బెంగాల్‌లో అరెస్టయిన నలుగురు జేఎంబీ ఉగ్రవాదులకు అత్యంత సన్నిహితుడు. అయితే, ముష్కరుడికి సంబంధించిన వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఎన్‌ఐఏ అధికారులు ఉగ్రవాదిని మంగళవారం అరెస్టు చేశారు.
అతనికి అల్-ఖైదా, హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ)తో సంబంధాలుండవచ్చని, బెంగాల్‌లో టెర్రర్ మాడ్యుల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల్లో బెంగాల్‌లో జేఎంబీ ఉగ్రవాదులు అరెస్టయ్యారు. 2016లో ఢాకాలోని ప్రముఖ కేఫ్‌పై ఉగ్రదాడి జరిపి 17 మంది విదేశీయులు సహా 22 మందిని చంపిన జేఎంబీ, భారత్‌లో తన ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తోందని ఎన్‌ఐఏ 2019లో పేర్కొన్నది.