తెలంగాణ

డీజిల్‌ పిరమాయె.. దొంగల రూటు మారె!

  • హైవేపై ఆగి ఉన్న లారీల్లో డీజిల్‌ చోరీ
  • లీటరు రూ.వందకు చేరడమే కారణం
  • మునగాలలో అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

బంగారం చోరీ కోసం కన్నాలు వేయడం చూశాం. ట్యాక్సులు తప్పించుకొనేందుకు బంగారం అక్రమ రవాణా గురించి విన్నాం. కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరలతో డీజిల్‌ బంగారంలా మారింది. ఈ ఇంధనం ధర రూ.వంద దాటడంతో అంతర్రాష్ట్ర దొంగలు మహారాష్ట్ర నుంచి వచ్చి హైవేలపై చోరీలకు తెగబడుతున్నారు. విజయవాడ హైవేపై రాత్రి వేళ ఆగి ఉన్న లారీల నుంచి డీజిల్‌ చోరిచేసి తక్కువకు స్థానికులకే విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. మహరాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా తెరికాడ్‌కు చెందిన డీజిల్‌ చోరీ ముఠాను అరెస్టు చేసినట్టు శనివారం సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీ రఘు తెలిపారు. తెరికాడ్‌కు చెందిన గణేశ్‌కాలే, రాజేందర్‌ శాజిత్‌కాలే, గులాబ్‌కాలే, గణేశ్‌ పవార్‌, రామసుబ్రావ్‌ కాలే, కాలే రాజాసిందే, సాచిన్‌ చాగన్‌కాలే ముఠాగా ఏర్పడ్డారు. రెండు కంటెయినర్‌ లారీలను, 53 ఖాళీ డీజిల్‌ క్యాన్లు, డీజిల్‌ తీసే పరికరాలతో ఈ నెల 18 బయలుదేరారు. 22న నార్కట్‌పల్లి పరిధిలో ఆగి ఉన్న లారీ నుంచి 300 లీటర్లు డీజిల్‌ను దొంగిలించి సూర్యాపేటలో రూ.30 వేలకు విక్రయించారు. 23న మునగాల మండలం ఇందిరానగర్‌లో లారీ నుంచి 400 లీటర్ల డీజిల్‌ దొంగిలించి పారిపోతుండగా తాడ్వాయి స్టేజీ వద్ద తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రెండు లారీలు, రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేశారు.