ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం కలిశారు. ఈ సమావేశంలో అమిత్‌షాతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించి, వినతిపత్రాలు సమర్పించనున్నారు. ఐపీఎస్ క్యాడర్ రివ్యూ, విభజన చట్టం హామీలపై చర్చించే అవకాశం ఉంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంపై చర్చించనున్నట్లు సమాచారం.
కాగా, సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రధాని మోదీని కలిసి యాదాద్రి దేవస్థానం పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు వెయ్యి కోట్లివ్వాలని, ప్రత్యేక గిరిజన వర్సిటీని నెలకొల్పాలని, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం ఏర్పాటు చేయాలని, కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు జవహర్ నవోదయ స్కూళ్లు మంజూరు చేయాలని, రెండు పారిశ్రామికవాడలను మంజూరుచేయాలని, పీఎంజీఎస్‌వై కింద అదనపు నిధులు ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరుతూ ప్రధానికి వినతి పత్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే.