ఖలిస్థానీ ( Khalistan ) ఉగ్రవాద గ్రూపు సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో ఆయనకు నిద్రలేని రాత్రులే ఉంటాయని చెప్పింది. ఈ నెల 24న మోదీ అమెరికా వెళ్తున్న సందర్భంగా ఆ సంస్థ ఇలా హెచ్చరించింది. వైట్‌హౌజ్ ముందు కూడా నిరసనలకు ప్రణాళికలు రచించింది. తొలిసారి ప్రత్యక్ష క్వాడ్ సమావేశంతోపాటు ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పాల్గొనడానికి మోదీ అమెరికా వెళ్తున్న విషయం తెలిసిందే. ఇండియాలో రైతులపై హింసకు వ్యతిరేకంగా తాము ఈ నిరసనలు చేపట్టనున్నట్లు ఎస్ఎఫ్‌జే చెప్పింది. ఆ ఉగ్రవాద గ్రూపు జనరల్ కౌన్సిల్ గుర్పత్‌వంత్ సింగ్ పన్నన్ మాట్లాడుతూ.. అమెరికాలో తాను మోదీకి నిద్రలేని రాత్రులను గడిపేలా చేస్తానని అనడం గమనార్హం.
అయితే ఈ గ్రూపుకు అంత సీన్ లేదని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రచారం కోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశారు. అందులో పాకిస్థాన్, ముఖ్యంగా ఐఎస్ఐ ఏజెంట్ల నంబర్లు కూడా ఉన్నాయి. అమెరికాలోనూ మోదీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టడానికి కొంతమందిని కూడదీసే ప్రయత్నం చేస్తోంది అని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ గ్రూపును ఇండియా జులై 10, 2019న నిషేధించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఓ యాప్‌ను అప్‌లోడ్ చేసి రెఫరెండం 2020కి రిజిస్టర్ చేసుకోవాలంటూ యూత్‌ను ఆకర్షించే ప్రయత్నం ఈ గ్రూపు చేస్తోంది.
లండన్‌లో ఆగస్ట్ 15న ఖలిస్థాన్ రెఫరెండమ్ జరుగుతుందని గతేడాది ఈ గ్రూపు ప్రకటించినా.. తర్వాత కొవిడ్ కారణంగా అక్టోబర్‌కు వాయిదా వేశారు. ఈ మధ్యే గుర్పత్‌వంత్ సింగ్ ఓ వీడియోలో మాట్లాడుతూ.. పంజాబ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఖలిస్థాన్ రెఫరెండమ్ జరుగుతుందని చెప్పడం గమనార్హం. ఒకవేళ యూకే, యూఎస్ఏ, యురోపియన్ యూనియన్ తాలిబన్లను గుర్తిస్తే.. తాము కూడా మద్దతు కోసం తాలిబన్లను కలుస్తామనీ ఇదే వీడియోలో గుర్పత్‌వంత్ చెప్పాడు.