అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రపంచానికి ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని ప్రధాని మోదీ అన్నారు. భారత్, అమెరికా సహజ భాగస్వాములని చెప్పారు. అధ్యక్షుడు బైడెన్, కమలా నేతృత్వంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటాయన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ప్రధాని మోదీ.. ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు దైపాక్షిక అంశాలపై చర్చించారు. దేశంలో కరోనా రెండో దశ మహమ్మారి ఉధృతి సమయంలో సహకరించిన అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కమలా హారిస్‌ను ప్రధాని మోదీ భారత పర్యటనకు ఆహ్వానించారు.
అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలవడం చరిత్రాత్మకమని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచానికి కమలా హారిస్ ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తని చెప్పారు. బైడెన్, కమలా హారిస్ నేతృత్వంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థానానికి చేరుకుంటాయని ఆశిస్తున్నాన్నారు. ప్రపంచం కఠినమైన సమస్యను ఎదుర్కొంటున్న సమయంలో ప్రెసిడెండ్ బైడెన్, మీరు అధికారంలోకి వచ్చారు. అయినప్పటికీ చాలా తక్కువ సమయంలో కరోనాను అదుపుచేయడంతోపాటు చాలా విజయాలు సాధించారని మోదీ అన్నారు.
అమెరికాకు భారత్ చాలాముఖ్యమైన భాగస్వామి అని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. ‘కరోనా ప్రారంభంలో టీకాలకు భారత్ వనరుగా ఉంది. కరోనా ఉధృతిలో భారత్‌కు సహకరించినందుకు గర్వంగా ఉంది. భారత్‌లో రోజుకు కోటి మందికి టీకా వేస్తున్నారు. విదేశాలకు మళ్లీ టీకాలు ఎగుమతి చేయాలని భారత్ తీసుకున్న నిర్ణయం సంతోషకరమైన విషయం. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయి. ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత భారత్, అమెరికాలపై ఉందని హారిస్ చెప్పారు.
అంతకుముందు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యొషిహిదె సుగాతో మోదీ సమావేశామయ్యారు. అమెరికా పర్యటనలో మోదీ కలవడం సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ అన్నారు. ప్రధాని మోదీ ఆస్ట్రేలియాకు మంచి స్నేహితుడని చెప్పారు. కరోనా తర్వాత ఇరువురు నేతలు ప్రత్యక్షంగా కలవడం ఇదే మొదటిసారి.
కాగా, ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై జపాన్ ప్రధాని సుగాతో మోదీ చర్చించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు.
నేడు బైడెన్‌తో భేటీ
ప్రధాని మోదీ నేడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమవనున్నారు. ఈ సందర్భంగా రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అఫ్ఘాన్ పరిణామాలు, ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.