అంతర్జాతీయం జాతీయం

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి

  • అమెరికా సీఈవోలకు ప్రధాని మోదీ పిలుపు

ప్రధాని నరేంద్రమోదీ గురువారం అయిదుగురు అమెరికా అగ్రశ్రేణి కార్పొరేట్‌ సంస్థల సారథులతో సమావేశమయ్యారు. భారత్‌లో విస్తృత అవకాశాలను వివరిస్తూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని వారిని కోరారు. సీఈవోలు క్రిస్టియానో అమోన్‌ (క్వాల్కామ్‌), మార్క్‌ విడ్మర్‌ (ఫస్ట్‌ సోలార్‌), శంతను నారాయణ్‌ (అడోబి), వివేక్‌ లాల్‌ (జనరల్‌ అటామిక్స్‌), స్టీఫెన్‌ ఏ స్కార్జ్‌మన్‌ (బ్లాక్‌స్టోన్‌)తో ప్రధాని వేర్వేరుగా భేటీ అయ్యారు. 5జీ, ఇతర డిజిటల్‌ ఇండియా కృషిలో భారత్‌తో కలిసి కృషి చేసేందుకు క్వాల్కామ్‌, ఫస్ట్‌ సోలార్‌ సంస్థల సీఈవోలు ఆసక్తి వ్యక్తం చేశారని ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. భారత్‌లో అడోబి కార్యకలాపాలు, భవిష్యత్తు ప్రణాళికలపై శంతనుతో ప్రధాని చర్చించారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ పేర్కొన్నారు. సీఈవోలతో భేటీ అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌తో ప్రధాని భేటీ అయ్యారు. అనంతరం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌తో మోదీ సమావేశమవుతారు.

ప్రవాస భారతీయులు మన బలం
అమెరికాలో మోదీకి ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. తొలుత విమానాశ్రయంలో ఇండియన్‌-అమెరికన్లు ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత హోటల్‌లో పలువురు ఎన్నారైలను మోదీ కలిశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయులకు ఒక ప్రత్యేకత ఉందని, వారు మన బలం అని కొనియాడారు.