అంతర్జాతీయం జాతీయం ముఖ్యాంశాలు

మోదీతో మీటింగ్‌.. ఉగ్ర‌వాదం పేరెత్తగానే పాకిస్థాన్ ప‌నేన‌న్న క‌మ‌లా హ్యారిస్‌

అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆ దేశ ఉపాధ్య‌క్షురాలు క‌మలా హ్యారిస్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్యా ఉగ్ర‌వాదం అంశంపైనా చ‌ర్చ జ‌రిగింది. ఈ స‌మ‌యంలో క‌మ‌లా నేరుగా పాకిస్థాన్ పేరును ప్ర‌స్తావించిన‌ట్లు విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి హ‌ర్ష్‌వ‌ర్ద‌న్ ష్రింగ్లా వెల్ల‌డించారు. ఉగ్ర‌వాదం అంశం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు ఇందులో పాకిస్థాన్ పాత్ర‌పై ఏమైనా చ‌ర్చ జ‌రిగిందా అని మీడియా ప్ర‌శ్నించిన‌ప్పుడు.. ఆ అంశం చ‌ర్చ‌కు రాగానే క‌మ‌లా హ్యారిస్ నేరుగా పాకిస్థాన్ పేరునే ప్ర‌స్తావించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

పాకిస్థాన్‌లో ఉగ్ర‌వాద సంస్థ‌లు ఉన్నాయ‌ని ఆమె అన్న‌ట్లు హ‌ర్ష్‌వ‌ర్ద‌న్ తెలిపారు. ఈ ఉగ్ర‌వాద గ్రూపులు అమెరికా, ఇండియా భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగించ‌కుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని పాకిస్థాన్‌కు క‌మ‌లా హ్యారిస్ సూచించిన‌ట్లు చెప్పారు. ప్ర‌పంచంలో ప్ర‌జాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతున్న నేప‌థ్యంలో మ‌న రెండు దేశాల్లో ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌ను, సంస్థ‌ల‌ను కాపాడాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని క‌మ‌లా హ్యారిస్ అభిప్రాయ‌ప‌డిన‌ట్లు తెలిపారు.

రెండు దేశాల ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌జాస్వామ్యాల‌ను బలోపేతం చేయాల‌ని పిలుపునిచ్చారు. క్వాడ్ స‌మావేశంలో భాగంగా అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌తో ప్ర‌ధాని మోదీ స‌మావేశం కానున్న నేప‌థ్యంలో వైస్‌ప్రెసిడెంట్ క‌మ‌లా హ్యారిస్‌తో స‌మావేశం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.