అంతర్జాతీయ ప్రయాణికులకు ఆస్ట్రేలియా స్వాగతం పలకనున్నది. నవంబర్ నుంచి విదేశీ ప్రయాణికుల కోసం సరిహద్దుల్ని తెరవనున్నది. కేవలం వ్యాక్సిన్ వేసుకున్న ప్రయాణికులను మాత్రమే అనుమతించనున్నది. 18 నెలల తర్వాత ఆస్ట్రేలియా తొలిసారి విదేశీ ప్రయాణికులకు ఆహ్వానం పలకనున్నది. ప్రస్తుతం ఆ దేశ పౌరులకు మాత్రమే ఆంక్షలతో ప్రయాణానికి అవకాశం కల్పిస్తున్నారు. విదేశాలకు వెళ్లేందుకు కూడా ఆస్ట్రేలియా తమ పౌరులకు అనుమతి ఇవ్వడంలేదు.
వ్యాక్సినేషన్ 80 శాతం దాటిన రాష్ట్రాలకు ట్రావెల్ ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. ఆస్ట్రేలియన్లకు మళ్లీ తమ జీవితాలను వెనక్కి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. దశలవారీగా 14 రోజుల హోటల్ క్వారెంటైన్ రూల్‌ను ఆస్ట్రేలియా ఎత్తివేయనున్నది. దీనికి బదులుగా వ్యాక్సిన్ వేసుకున్న ప్రయాణికులకు ఏడు రోజుల హోం క్వారెంటైన్ విధించనున్నది. వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సిడ్నీ, మెల్‌బోర్న్, క్యాన్‌బెరాలో ఇంకా లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి.