ఆంధ్రప్రదేశ్

ఏపీలో రూ.1,750 కోట్లతో ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ

ఏపీలో రూ. 1,750 కోట్లతో ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్స్‌ ఏర్పాటుచేసేందుకు కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీ ముందుకొచ్చింది. దీనిలో భాగంగా కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో సులజ్జ ఫిరోదియా మొత్వాని, కో–ఫౌండర్‌ రితేష్‌ మంత్రి శుక్రవారం క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.

విశాఖలో బ్రాండెడ్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ నెలకొల్పేందుకు కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ ఆసక్తి కనబరిచింది.  ఇప్పటికే పూణే సమీపంలోని అహ్మద్‌నగర్‌లో నెలకు 6,000 ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి సామర్ధ్యం కల ప్లాంట్‌ని ఏర్పాటు చేసింది. అలానే రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కైనెటిక్‌ కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో కంపెనీ ప్రతినిధులు సీఎం జగన్‌కు ప్రణాళికలను వివరించారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్దిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.