అంతర్జాతీయం ముఖ్యాంశాలు

Nuclear Secrets | శాండ్‌విచ్‌లో పెట్టి అణురహస్యాలు అమ్మేసిన ఇంజినీర్‌ దంపతులు!

అమెరికాకు చెందిన ఒక న్యూక్లియర్ ఇంజినీర్‌, అతని భార్య దేశ రహస్యాలను అమ్మేసుకుంటూ పట్టుబడ్డారు. ఒక అండర్‌కవర్‌ ఎఫ్‌బీఐ ఏజెంట్‌కు వీరిద్దరూ ఈ రహస్యాలను అమ్మినట్లు అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. జొనాథన్ టోబె, అతని భార్య డయానా ఇద్దరూ కూడా ఈ డీల్స్ ద్వారా భారీగా డబ్బు వసూలు చేసినట్లు సమాచారం.

నేవీలో న్యూక్లియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జొనాథన్‌కు టాప్‌ లెవెల్ క్లియరెన్స్ ఉంది. దీన్ని ఉపయోగించుకున్న ఈ దంపతులు నేవీకి చెందిన కొన్ని సబ్‌మెరీన్‌ రహస్యాలను ఒక విదేశీయుడికి అమ్మకానికి పెట్టారు. ఆ విదేశీయుడిలా వీరిద్దరినీ కలిసింది ఒక అండర్‌కవర్‌ ఎఫ్‌బీఐ అధికారే. ఒకసారి సగం తినేసిన శాండ్‌విచ్‌లో సబ్‌మెరీన్‌ రహస్యాలున్న మెమరీ కార్డు ఉంచి పడేశారీ దంపతులు. దాన్ని విదేశీయుడిలా నటిస్తున్న అధికారి ఆ తర్వాత తీసుకున్నాడు.

మరోసారి బబుల్‌ గమ్‌ కాగితంలో మెమరీ కార్డ్ చుట్టి కూడా రహస్యాలు చేరవేశారు. ఈ మెమరీ కార్డుల్లో వర్జీనియా క్లాస్ సబ్‌మెరీన్‌ రియాక్టర్‌కు సంబంధించిన మిలటరీ స్థాయి రహస్యాలు ఉన్నట్లు న్యాయశాఖ వెల్లడించింది. ఇలా రహస్యాలు చేరవేసినందుకు జొనాథన్ దంపతులు క్రిప్టోకరెన్సీ రూపంలో సుమారు లక్ష డాలర్లు తీసుకున్నట్లు తెలిపింది. మేరీల్యాండ్‌కు చెందిన ఈ జంటపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.