జాతీయం ముఖ్యాంశాలు

Kashmiri Pandits : శ్రీనగర్‌లో కశ్మీరీ పండిట్ల ప్రదర్శన.. ముస్లింల మద్దతు

(Kashmiri Pandits) ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్‌లోని కశ్మీరీ పండిట్లు సోమవారం రాత్రి పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. లాల్‌ చౌక్‌లో చేపట్టిన ఈ ప్రదర్శనలో స్థానిక ముస్లింలు కూడా పాల్గొని కశ్మీరీ పండిట్లకు మద్దతు తెలిపారు. ఎక్కడ ఉన్నా కలిసి ఉందామని.. ఇంకా ఎంత కాలం వరకు అంటూ బ్యానర్లు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కశ్మీర్‌లోని ముస్లిమేతరులకు భద్రత కల్పించేందుకు ముస్లిం సమాజం ముందుకు రావడం శుభపరిణామం. ముస్లింలు కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడటం విశేషం. ఉగ్రవాద బాధితుల కుటుంబాల బాధను పంచుకోవడానికి వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ముస్లిమేతరులు ఎవరూ కశ్మీర్‌ వదిలి పోవద్దంటూ శ్రీనగర్‌లోని రెండు ప్రధాన మసీదుల ఇమామ్‌లు పిలుపునిచ్చారు.

ఇటీవల పెరిగిపోయిన ఉగ్రదాడులకు వ్యతిరేకంగా శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద కశ్మీరా పండిట్లు శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టారు. వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం క్రీడాకారులు, ప్రభుత్వ ఉద్యోడులు, సీనియర్‌ సిటిజన్లు కూడా ఇందులో పాల్గొని ఈ హత్యలను తీవ్రంగా ఖండించారు. ఇటీవలి హత్యలను కశ్మీర్‌లో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నంగా పేర్కొన్నారు. ముస్లిమేతరులు ఎవరూ శ్రీనగర్‌ విడిచిపోవద్దని కోరారు. కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగుల సంస్థల్లో అతిపెద్దదైన ఐజాక్ చైర్మన్‌ రఫీక్‌ రథర్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, కశ్మీరీ పండిట్లు నివసించే ప్రాంతాలను సందర్శించడం ద్వారా వారికి ధైర్యాన్ని అందిస్తున్నారు.