జాతీయం

విమాన ఇంధనం కన్నా పెట్రోల్‌ రేటే ఎక్కువ!

  • మళ్లీ 35 పైసల చొప్పున చమురు వాత
  • హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ 110.44
  • ఏటీఎఫ్‌ కంటే 33 శాతం అధికం
  • మూడు వారాల్లో 16 సార్లు పెంపు
  • ఈ నెలలోనే సగటున రూ.5 వడ్డన
  • రాజస్థాన్‌లో అత్యధికంగా 117.66
  • 12 రాష్ర్టాల్లో సెంచరీ కొట్టిన డీజిల్‌

పెట్రోల్‌ ధరల పెంపునకు దేశంలో అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అంతర్జాతీయ మార్కెట్‌ పేరు చెప్పి చమురు కంపెనీలు ఇంధన ధరలను ఎడాపెడా పెంచేస్తున్నాయి. నియంత్రించాల్సిన కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆదివారం మళ్లీ 35 పైసల చొప్పున పెరిగాయి. నాలుగు రోజులుగా చమురు కంపెనీలు లెక్కగట్టినట్టు రోజుకు 35 పైసల చొప్పున పెంచుకొంటూ వస్తున్నాయి. ఫలితంగా హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.44కు, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 103.54కు పెరిగింది. గడిచిన మూడు వారాల్లో పెట్రోల్‌ ధర 16 సార్లు, డీజిల్‌ ధర 19 సార్లు పెరిగింది. ఒక్క ఈ నెలలోనే లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌లపై రూ.5 చొప్పున రేట్లు పెరిగాయి. దేశంలోని అన్ని రాష్ర్టాల రాజధానుల్లో పెట్రోల్‌ రేటు ఇప్పటికే రూ.100 దాటగా, డజనుకు పైగా రాష్ర్టాల్లో డీజిల్‌ కూడా సెంచరీ కొట్టింది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో లీటరు పెట్రోల్‌ ధర అత్యధికంగా రూ. 117.86కు చేరగా, లీటరు డీజిల్‌ ధర రూ. 105.95గా ఉన్నది.

పెట్రో ధరల పెరుగుదల ఎంతలా ఉందంటే విమానంలో వాడే ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌(ఏటీఎఫ్‌) కన్నా పెట్రోల్‌, డీజిల్‌ ధరలే ఎక్కువ. లీటరు ఏటీఎఫ్‌ ధర రూ.79 కాగా, లీటరు పెట్రోల్‌ రూ. 110. అంటే ఏటీఎఫ్‌ కంటే పెట్రోల్‌ ధర 33% ఎక్కువ. దీనిని ఉటంకిస్తూ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మోదీజీ మీరిస్తానన్న రూ.15లక్షలు ఇవ్వండి. చిన్న విమానం కొనుక్కొని, వాటిల్లో ప్రయాణిస్తాం. ఈ పెట్రోల్‌ రేట్లను మేం భరించలేం’ అంటూ తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.