భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చేందుకు రక్షణశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా రూ.7,965 కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఇవాళ జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా రూ.7,965కోట్లతో సాయుధ దళాల ఆధునీకరణ, కార్యాచరణ అవసరాలు తదితర ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 12 లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు, నౌకాదళ యుద్ధనౌకల ట్రాకింగ్, ఎంగేజ్‌మెంట్ సామర్థ్యాలను మెరుగుపరిచే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి లింక్స్ యు2 నావల్ గన్‌ఫైర్ కంట్రోల్ సిస్టమ్.. సముద్ర నిఘా, తీర ప్రాంత నిఘాలో నౌకాదళ సామర్థ్యాన్ని పెంచేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా ‘డోర్నియర్ విమానాల మిడ్-లైఫ్ అప్‌గ్రేడేషన్’కు డీఏసీ ఆమోదముద్ర వేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సాయుధ దళాల ఆధునీకరణ, కార్యాచరణ అవసరాల కోసం రూ.7,965 ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది. ఈ ప్రతిపాదనలన్నీ మేక్ ఇన్ ఇండియా కింద దేశంలోనే డిజైన్, డెవలప్‌మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్‌పై దృష్టి సారించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. తూర్పు లడఖ్‌లో చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రక్షణ శాఖ సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తున్నది.