Badvel by election | బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైసీపీ విజయదుందుభి మోగించింది. వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 90వేలకు పైగా మెజారిటీతో ఘన సాధించారు. పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి 90,228 ఓట్ల మెజారిటీని సాధించారు. గత ఎన్నికల్లో దాసరి సుధ భర్త వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ ఈ ఎన్నికల్లో తన భర్త కంటే దాదాపు రెట్టింపు మెజారిటీని సాధించారు. దాసరి సుధకు మొత్తం 1,11,710 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 21,621 ఓట్లు, కాంగ్రెస్‌కు 6,205 ఓట్లు, నోటాకు 3,622 ఓట్లు పోలయ్యాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి దాసరి వెంకట సుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో వైసీపీ అధిష్టానం.. బద్వేల్ నియోజకవర్గ అభ్యర్థిగా దాసరి సుధను ఎంపిక చేసింది.