(Ganjai and Girijans) రాష్ట్రంలో గంజాయి సరఫరాను నిర్మూలించే పనిలో ఎక్సైజ్ పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే, విశాఖ మన్యంలో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి గిరిజనులు ఎక్సైజ్ పోలీసులు తమ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో కొందరు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా సోమవారం సాయంత్రం ఓ గూడెంకు వచ్చి చేదు అనుభవం ఎదుర్కొన్నారు. వారిని గిరిజనులు కొట్టినంత పని చేశారు. వారి వాహనాలను కిందపడేశారు. అధికారులు అని కూడా చూడకుండా వారిపై బూతులు లంఘించుకున్నారు.
విశాఖ మన్యంలో గంజాయి పంటను ధ్వంసం చేసేందుకు వెళ్లిన ఎక్సైజ్ అధికారులకు స్థానిక గిరిజనుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. జీ మాడుగుల మండలం బోయితల్లి పంచాయతీ పరిధిలో గంజాయి పంటలను ధ్వంసం చేస్తుండగా గిరిజనులు ఎదురుతిరిగారు. కర్రలు, రాళ్లతో అధికారులను భయపెట్టారు. వారి వాహనాలను కిందపడదోసి రాళ్లతో ధ్వంసం చేశారు. ఎలా వచ్చారో అలా వెళ్లనిపక్షంలో జీపులను తగలబెడతామని హెచ్చరించారు. స్థానిక సీఐతోపాటు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బాజీరావు ఎంత నచ్చజెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. తమ తండాల్లోకి పోలీసులుగానీ, ఎక్సైజ్ వాళ్లు గానీ రావద్దొంటూ హుకూం జారీ చేశారు. గంజాయి పండిస్తే తప్పేంటని గదమాయించారు. గిరిజనులు పెద్ద సంఖ్యలో ఎదురుతిరగడంతో ఎక్సైజ్ అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.