ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

Buggana : గవర్నర్‌ ఆమోదంతోనే ఉత్తర్వులు, నిర్ణయాలు : మంత్రి బుగ్గన

(Buggana) రాష్ట్ర గవర్నర్‌ ఆమోదం చెబితేనే ఉత్తర్వులు వెలువడుతాయని, నిర్ణయాలపై ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. ఎస్డీసీ రుణాల విషయంలో జరుగుతున్న వివాదం రాజకీయం చేయడం సరికాదన్నారు. రుణాల కోసం ప్రభుత్వం తన పేరును వాడుకోవడంపై ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ మండిపడ్డారన్ని వార్తలను బుగ్గన వద్ద మీడియా ప్రస్తావించగా, ఈ విషయాన్ని ఆయనే నేరుగా ప్రశ్నిస్తే స్పష్టం ఇస్తామన్నారు. అయినా, గవర్నర్‌ పేరుతోనే ప్రభుత్వ పాలన జరుగుతున్న విషయం మరిచిపోవద్దని చెప్పారు. గవర్నర్‌కు రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల మేరకే ఒప్పందాలు జరుగుతాయని మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వాలు ఎవరి పేరుతో అప్పులు చేశాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రశ్నించారు. నిధుల వినియోగానికి సంబంధించి కాగ్‌ అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఇప్పుడు కొత్తకాదని, అత్యంత సహజమైన విషయమన్నారు. కాగ్‌ అభ్యంతరాలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమాధానాలు ఇస్తూనే ఉంటుందని చెప్పారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌బీఎం 11 శాతం పరిమితి దాటిందని అభ్యంతరాలు వ్యక్తం అవుతాయన్నారు. ఒకటి, రెండు రోజులు ఆలస్యమైనప్పటికీ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాల అమలు కోసమే రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. భూములు తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం సహజమైన విషయమని బుగ్గన కొట్టిపారేశారు.