(Amaravathi Padayatra) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర రెండోరోజుకు చేరింది. తాడికొండలో నిన్న రాత్రి బస చేసిన రైతులు.. అక్కడి నుంచే రెండోరోజు పాదయాత్రను మొదలుపెట్టారు. స్థానిక ఆలయంలో వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు జరిపిన రైతులు పాదయాత్రగా కదిలారు. ఎందరో ప్రజలు, భూములిచ్చిన రైతులు సాగిస్తున్న ఈ పాదయాత్రకు దారి పొడవునా ప్రజలు నీరాజనాలు పట్టారు. తొలి రోజు 14.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరిగింది. రెండోరోజు మహాపాదయాత్ర గోరంట్లలో ముగుస్తుంది. 45 రోజుల పాటు మహాపాదయాత్ర కొనసాగనున్నది. డిసెంబర్17న తిరుపతిలో జరిగే బహిరంగ సభతో మహాపాదయాత్ర ముగియనున్నది.
తుళ్లూరు నుంచి తిరుమల వరకూ చేపట్టిన మహాపాదయాత్రలో రైతులు, రైతు కూలీలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తాడికొండ గ్రామస్థులు పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. ‘జై అమరావతి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మార్గమధ్యలో పలు గ్రామాల ప్రజలు, విద్యార్ధులు రైతులకు స్వాగతం పలికారు. నెల్లూరు నుంచి ధన్వంతరి సంఘం సభ్యులు రైతుల పాదయాత్రకు సంఘీభావంగా తరలివచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కే శ్రీనివాసరావు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని కోసం భూములిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం.. రాజధానిని మారుస్తాం అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని రైతులు ప్రశ్నించారు. సీఆర్‌డీఏ రద్దు బిల్లు చెల్లదని.. న్యాయస్థానంలో విజయం తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు.