జాతీయం

ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 25 జికా వైరస్ కేసులు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కొత్తగా 25 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో జికా వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 36కు పెరిగింది. నగరంలోని తివారీపూర్, అష్రఫాబాద్, పోఖర్‌పూర్, శ్యామ్ నగర్, ఆదర్శ్ నగర్ ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదయ్యాయని కాన్పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) నేపాల్ సింగ్ తెలిపారు. వైద్య బృందాలను పలు ప్రాంతాలకు తరలించామని, ప్రజలు భయాందోళన చెందవద్దని చెప్పారు. వైద్య సిబ్బంది ఇండ్లకు వెళ్లి నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నాయని వెల్లడించారు.

కాగా, యూపీలోని కాన్పూర్‌లో అక్టోబర్‌ చివరి వారంలో తొలి జికా వైరస్‌ కేసు నమోదైంది. జికా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి కోవిడ్ మాదిరి ‘ట్రేస్, టెస్ట్, ట్రీట్’ ఫార్ములాను పాటించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.