- మళ్లీ కరోనా ఉద్ధృతితో ఆందోళన
అమెరికాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్నది. పలు ప్రాంతాల్లోని దవాఖానల ఐసీయూలు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. రెండు వారాల కిందటితో పోలిస్తే 12 రాష్ర్టాల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల సంఖ్య పెరిగింది. వ్యాక్సినేషన్ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా దవాఖానలపై ఒత్తిడి తీవ్రంగా ఉండటం కరోనా తాజా వేవ్‌ను సూచిస్తున్నదని చెబుతున్నారు. పలు పశ్చిమ రాష్ర్టాల్లో చికిత్స అందించేందుకు వైద్యులు, నర్సులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు దేశంలో డెల్టా వేరియంట్ వ్యాప్తి ఇప్పటికీ కొనసాగుతున్నది. మరోవైపు శీతాకాలంలో వైరల్ వ్యాధుల బెడద ఉంటుంది. ఈ నేపథ్యంలో రాబోయే కొన్ని నెలలు కష్ట కాలమేనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. కరోనాకు ఫైజర్ సంస్థ మాత్రను తెచ్చినా ఇంకా అది అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి రాలేదు.