- నెల్లూరులో పలు చెరువులకు గండ్లు
- పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
- రాకపోకలకు అంతరాయం
- నిలిచిపోయిన 200 ఆర్టీసీ బస్సులు
- వరదలో కొట్టుకుపోయిన యువకుడు
- కడపలోనూ వాన విధ్వంసం
- నేకనాపురంలో కొట్టుకుపోయిన బ్రిడ్జి
రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నెల్లూరు, కడప జిల్లాల్లో సోమవారం కూడా జనజీవనం స్తంభించిపోయింది. నెల్లూరు జిల్లాలో ఆది, సోమవారాలు కుంభవృష్టి కురిసింది. 48 గంటలు ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఒకటి రెండు చెరువులకు గండ్లు పడగా, కట్టలు తెగేప్రమాదం ఉందని ఒకటి రెండు చెరువులకు అధికారులే గండ్లు కొట్టారు. గ్రామీణ రూట్లలో 200 వరకు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ఒక్కరోజే ఆర్టీసీకి రూ.30 లక్షల నష్టం వాటిల్లింది. గూడూరు ఆదిశంకర కాలేజీ వద్ద వరద ప్రవాహానికి చెన్నై జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల పొడవున వాహనాలు ఆగిపోయాయి. ఇక్కడ రోడ్డు దాటడానికి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఎస్పీ విజయరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
గడచిన 24 గంటల్లో జిల్లాలో సగటున 107.9 మి.మీ వర్షపాతం నమోదైంది. కండలేరు జలాశయం మట్టికట్ట 6వ కిలోమీటరు వద్ద సోమవారం భారీగా గుంత పడింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సంగం మండలం వంగల్లు వద్ద దువ్వూరు అలుగులో కొట్టుకుపోయి ఓ యువకుడు మరణించాడు. ఇక కడప జిల్లా వ్యాప్తంగా సోమవారం ఓ మోస్తారు వర్షం కురిసింది. కడప నగరం మరోసారి జలమయమైంది. కాపువీధి, కొత్తవీధిలో మోకాళ్ల లోతున నీళ్లు నిలిచాయి. బి.కోడూరు మండలం రామచంద్రాపురంలో మూడు పక్కా గృహాల స్లాబ్‌లు కూలిపోయాయి. కలసపాడులో భారీ వర్షాలకు సగిలేరు పారింది. ముష్టేరు నది పారింది. సిద్ధవటం మండలకేంద్రంలోని మఠం వీధికి చెందిన ఓబయ్య అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది. జంగాలపల్లె గ్రామం సమీపంలోని కాజ్వే వంతెనకు గండి పడింది. నేకనాపురం రహదారిలోని పాత బ్రిడ్జి వంక ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు ఆగిపోయాయి.
ఎర్రవాగు ఉధృతికి చిక్కుకున్న గొర్రెల కాపరులు
కడప జిల్లా పోరుమామిళ్ల మండలం వాసుదేవాపురంలో ఎర్రవాగు ఉధృతంగా ప్రవహించడంతో ఎర్రవాగు కొండపైకి దాదాపు 600కు పైగా గొర్రెలను తొలుకొని వెళ్లిన 12 మంది కాపరులు అక్కడే చిక్కుకుపోయారు. వారిలో 10 మందిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రాత్రికి ఒడ్డుకు చేరారు. మరో ఇద్దరినీ మంగళవారం ఒడ్డుకు చేర్చే అవకాశాలున్నాయి. 40 గొర్రెలు నీటిలో కొట్టుకుపోయాయని కాపర్లు చెబుతున్నారు.
2న రాజంపేటలో సీఎం పర్యటన: సబ్‌కలెక్టర్
ముఖ్యమంత్రి జగన్ డిసెంబరు 2వ తేదీన కడప జిల్లా రాజంపేట వరదప్రాంతాల్లో పర్యటించన్నారని రాజంపేట సబ్‌కలెక్టర్ కేతన్‌గార్గ్ చెప్పారు. ముఖ్యమంత్రి సలహాదారు రాజంపేటలో పర్యటిస్తూ సీఎం పర్యటన వివరాలు తెలియజేశారన్నారు.