అంతర్జాతీయం

చైనా నుంచి పాకిస్తాన్‌ 25 యుద్ధ విమానాలు కొనుగోలు

రక్షణ వ్యవస్థ బలోపేతంలో భారత్‌కు దీటుగా పాకిస్తాన్‌ అడుగులు వేస్తోంది. ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ సమీకరించిన రాఫెల్‌ ఫైటర్లకు పోటీగా చైనా నుంచి పాకిస్తాన్‌ 25 యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. జే10-సీ యుద్ధ విమానాల స్క్రాడ్రన్‌ను పాక్‌ కొనుగోలు చేసినట్లు ఆదేశ హోంశాఖ మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ అధికారిక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 23న జరిగే పాకిస్థాన్‌ డే వేడుకలకు జే-10సీతో కూడిన 25 ఆల్‌-వెదర్‌ ఎయిర్‌క్రాప్ట్‌ల పూర్తి స్క్వాడ్రన్‌ పాల్గొంటుందని చెప్పారు. చైనా తన అత్యంత విశ్వసనీయమైన యుద్ధ విమానాలలో ఒకటైన జే-10సీని అందించడం ద్వారా సన్నిహిత మిత్రదేశాన్ని రక్షించడానికి ముందుకొచ్చిందని అన్నారు. తన ప్రముఖ ఆంగ్ల-మీడియం సహోద్యోగులను ఎగతాళి చేయడానికి తనను తాను ‘ఉర్దూ-మీడియం విద్యాసంస్థల గ్రాడ్యుయేట్‌’ అని తరచుగా చెప్పుకునే మంత్రి, విమానం పేరును జే-10సీకి బదులుగా చైనీస్‌ జే-10 అంటూ తప్పుగా ఉచ్ఛరించారు.

డిసెంబరు 7న పాకిస్తాన్‌లో దాదాపు 20 రోజులపాటు చైనా వైమానికదళం సంయుక్త విన్యాసాలు జరిపింది. ఈ వేడుకలకు జే-10సి, జె-11 బి జెట్‌ ఫైటర్లతోపాటు కేజే-500 ముందస్తు హెచ్చరిక ఎయిర్‌క్రాప్ట్‌, వై-8 ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ ఎయిర్‌క్రాప్ట్‌లతో సహా అధునాతన యుద్ధ విమానాలను పంపింది. పాకిస్తాన్‌ నుంచి 17 మిరాజ్‌ యుద్ధ విమానాలు విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. వాస్తవానికి అమెరికా నుంచి సేకరించిన ఎఫ్‌-16 యుద్ధ విమానాలు రాఫెల్‌ ఫైటర్లకు దీటైనవి. అయినప్పటికీ ఫ్రాన్స్‌ నుండి భారత్‌ రాఫెల్‌ జెట్‌లను కొనుగోలు చేసిన నేపథ్యంలో రక్షణను పెంచుకోవడానికి కొత్త మల్టిరోల్‌ జెట్‌ల అన్వేషణలో భాగంగా పాకిస్తాన్‌ చైనా ఫైటర్లను కొనుగోలుచేసింది.