కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోంది. ఈ ప్రాంతాల్లో జాతీయ విధానం మరియ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం.. తీసుకున్న చర్యలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు స్ధానిక ప్రజల హక్కుల పరిరక్షణ వంటి బహుముఖ విధానం– సానుకూల ఫలితాలను అందించిందని అన్నారు.
కేంద్ర హోంమంత్రిత్వశాఖ మద్దతుతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటోంది.
మా ప్రభుత్వం అనుసరించిన వ్యూహాల వల్ల రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మొదట్లో ఆంధ్రప్రదేశ్‌లోని 5 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న చురుకైన చర్యల కారణంగా… మావోయిస్టు తీవ్రవాదబలం 2019 నుంచి 2023 నాటికి 150 నుంచి 50 కి తగ్గిందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన సరిహద్దులను ఒడిశా, తెలంగాణా మరియు చత్తీస్‌ఘడ్‌లతో పంచుకుంటుంది. పొరుగు రాష్ట్రాలతో పటిష్టమైన సమన్వయం ఉంది. నాలుగు రాష్ట్రాల అధికారులతో కూడిన జాయింట్ టాస్క్‌ఫోర్స్‌లు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి మాకున్న సమాచారాలను ఈ ఉమ్మడి టాస్కఫోర్స్ ద్వారా పరస్పరం పంచుకుంటూ… సమిష్టిగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని అన్నారు.
ఆర్ఓఎఫ్ఆర్… అటవీ ప్రాంతంలో అర్హులైన 1.54 లక్షల మంది గిరిజన రైతులకు 3.22 లక్షల ఎకరాల మేరకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు జారీచేశాం. వారి భూములను సాగు చేసుకునేందుకు మద్ధతుగా, పెట్టుబడి ఖర్చు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతు భరోసాగా రూ.13,500 ఆర్ధిక సహాయం అందజేస్తోంది.
మావో ప్రభావిత ప్రాంతాల్లో రహదారులతో అనుసంధానం అన్నది అత్యంత కీలకమైన అంశం. ఈ నేపధ్యంలో మేము వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజమ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ స్కీం కింద ఇప్పటికే 1087 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసాం.
ప్రభుత్వ సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా, పారదర్శకంగా మరియు త్వరితగతిన అందజేయడం కోసం మేము 897 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశాం. ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులతో పాటు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ కూడా ఉన్నారు. కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇందులో భాగంగా మొబైల్ కనెక్టివిటీ పెంచడం కోసం 944 కమ్యూనికేషన్ టవర్లను ఏర్పాటు చేశాం.
వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో విద్య ప్రధానమైనది. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆంధ్రప్రదేశ్‌లో 28 ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేసింది. వాటిలో 24 పాఠశాలలు వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లోనే ఉన్నాయి. వీటి ద్వారా మా గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోంది. దీనితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం 1953 ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలు మరియు 81 గురుకుల పాఠశాలలు, 378 ఆశ్రమ పాఠశాలలతో పాటు 179 ప్రీ మరియు పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను నిర్వహిస్తోంది.
మరోవైపు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంవలను బలోపేతం చేయడానికి, మా ప్రభుత్వం కొత్తగా 879 విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు గిరిజన ప్రాంతాల్లో 75 –108 అంబులెన్స్‌లు పనిచేస్తున్నాయి. 89 మొబైల్ మెడికల్ యూనిట్ల(104) ద్వారా గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ సేవలను కూడా ప్రవేశపెట్టాం.
వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి, శాంతిని సాధించడం, వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు విస్తరించకుండా నిరోధించడం కోసం కేంద్ర, రాష్ట్రాల నడుమ నిరంతరం పరస్పర సహాయ సహకారాలు అవసరం. ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అయినప్పటికీ… వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు.. అక్కడ పోలీసు బలగాల ఆధునీకరణ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్ధిక మరియు వ్యూహాత్మక మద్ధతును కేంద్రం అందించడం అన్నది చాలా కీలకం. హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ధృడమైన మార్గదర్శకత్వం, మద్దతుతో మేము మా రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను విజయవంతంగా రూపుమాపుతామని, మా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని నేను విశ్వసిస్తున్నానని అన్నారు.