ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకి IMD చల్లని కబురు చెప్పింది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరి కొద్ది రోజుల్లోనే వడగాలుల నుంచి ఊరట లభిస్తుందని స్పష్టం చేసింది. రాజస్థాన్ మీదుగా తుఫాన్ ప్రబలే అవకాశముందని ఈ కారణంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, మహారాష్ట్రలో వర్షాలు కురవనున్నాయని అంచనా వేసింది. మరో మూడు నాలుగు రోజుల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. ఛత్తీస్‌గఢ్‌లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఏప్రిల్ 14వ తేదీన వరకూ వాతావరణం ఇలాగే ఉంటుందని వివరించింది. మధ్య ప్రదేశ్‌లో వడగండ్ల వాన కురిసే అవకాశముందని IMD స్పష్టం చేసింది. వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా బిహార్ రాష్ట్రాల్లోనూ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ నుంచి వాయువ్య భారతంలోనూ మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి.
జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మంచు కురుస్తుందని IMD అంచనా వేసింది. ఏప్రిల్ 13-15 మధ్య కాలంలో అక్కడి వాతావరణంలో మార్పు వస్తుందని వెల్లడించింది. అటు యూపీ, పంజాబ్, హరియాణాలోనూ ఇవే తేదీల్లో పొడి గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని ISM అంచనా వేసింది. అటు ఉత్తరభారతంలోనూ భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. ఏప్రిల్ 13,14వ తేదీల్లో జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో వానలు కురిసే అవకాశముందని తెలిపింది.