తెలంగాణ

బ్లాకులవారీగా అటవీ పునరుద్ధరణ

తెలంగాణలోని అన్ని అటవీ ప్రాంతాలు, బ్లాకులు నూరుశాతం పునరుద్ధరణ జరగాలనేది ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. మంగళవారం అరణ్యభవన్‌లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ పునరుద్ధరణ కోసం చేపట్టిన పనులు పారదర్శకంగా జరగాలని, ఆడిట్‌ సక్రమంగా నిర్వహించాలని స్పష్టంచేశారు. కంపా నిధుల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించారు. కంపా నిధుల వినియోగం, చేపట్టిన పనులు, ఫలితాలపై సమావేశంలో పీసీసీఎఫ్‌ (కంపా) లోకేశ్‌ జైస్వాల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. గత ఆరేండ్లలో కేంద్రం నుంచి రూ.1,755 కోట్ల కంపా నిధులు (ప్రత్యామ్నాయ అటవీకరణ) విడుదలయ్యాయని, రూ.1,497 కోట్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ఏడాది రూ.750 కోట్ల నిధులతో పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా, కేంద్రం నుంచి రూ.459 కోట్ల పనులకు అనుమతి వచ్చిందన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, అటవీశాఖ సంయుక్త కార్యదర్శి ప్రశాంతి సమావేశంలో పాల్గొన్నారు.
ఏపీపీల వయోపరిమితి పెంపుపై కృతజ్ఞతలు
రాష్ట్రంలో త్వరలో భర్తీ చేయనున్న అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) పోస్టులకు ఇప్పుడున్న గరిష్ఠ వయోపరిమితిని 34 నుంచి 44 సంవత్సరాలకు పెంచినందుకు న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి మంగళవారం టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ఇన్‌చార్జి సీ కల్యాణ్‌రావు, ప్రతినిధులు లలితారెడ్డి, నల్లమోతు రాము, వేణుగోపాలరావు, అజయ్‌కుమార్‌, పురేందర్‌రెడ్డి, రాము పసుపుల, శ్రీనివాస్‌నాయక్‌, చంద్రశేఖర్‌, జయకృష్ణ తదితరులున్నారు.