జాతీయం ముఖ్యాంశాలు

Corona in Kerala: కేర‌ళ‌లో నేడు కూడా భారీగానే కొత్త కేసులు

కేర‌ళ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ( Corona in Kerala ) విజృంభ‌ణ ఇంకా కొన‌సాగుతూనే ఉన్న‌ది. దేశ‌వ్యాప్తంగా న‌మోద‌వుతున్న మొత్తం కొత్త కేసుల‌లో కేర‌ళ‌లో న‌మోద‌వుతున్న‌వే స‌గానికిపైగా ఉంటున్నాయి. ఇవాళ కూడా కొత్త‌గా 6,075 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 50,95,924కు పెరిగింది. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా కేర‌ళ‌లో భారీగానే న‌మోద‌వుతున్నాయి.

ఇవాళ కొత్త‌గా 32 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోవ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 37,299కి చేరింది. ఇక జిల్లాల వారీగా చూస్తే ఇవాళ‌ తిరువ‌నంత‌పురంలో అత్య‌ధికంగా 949 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఎర్నాకుళం (835), కొల్లామ్ (772) ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇవాళ 6,061 మంది మ‌హ‌మ్మారి బారి నుంచి కోలుకోవ‌డంతో మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 49,96,878కి చేరింది. ప్ర‌స్తుతం 61,114 యాక్టివ్ కేసులు ఉన్నాయి.