- రోబోల సాయంతో ఆరు దశల్లో ప్రక్రియ
- భూకక్ష్యలో ప్రమాదాల్ని తప్పించేందుకే
- ఆస్ట్రేలియా కంపెనీ వినూత్న విధానం
భూ స్థిర కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష వ్యర్థాల (స్పేస్ జంక్) నుంచి రాకెట్ ఇంధనాన్ని తయారు చేయడానికి ఆస్ట్రేలియాకు చెందిన ‘న్యూమన్ స్పేస్’ కంపెనీ ముందుకొచ్చింది. దీని కోసం ‘ఇన్-స్పేస్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్’ను అభివృద్ధి చేసింది.
ఈ ప్రాజెక్టు అవసరమేంటి?
కాలంతీరిన ఉపగ్రహాలు, పాడైపోయిన శాటిలైట్లు, వ్యోమనౌకల విడి భాగాలు భూ స్థిర కక్ష్యలో భారీగా శకలాల రూపంలో పరిభ్రమిస్తున్నాయి. వేగంగా, అస్తవ్యస్తంగా ప్రయాణించే ఈ శకలాలతో కొత్త ఉపగ్రహాలకు, అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ముప్పు వాటిల్లవచ్చని భయపడుతున్నారు. అలాగే, రాకెట్ ఇంధనం ఖర్చు పెరిగిపోయింది. దీంతో ఈ వ్యర్థ శకలాలతో రాకెట్ ఇంధనాన్ని తయారీకి ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారు.
ఇంధనాన్ని ఎలా తయారు చేస్తారు?
మూడు ఇతర కంపెనీల సాయంతో స్పేస్ జంక్ నుంచి ఇంధనాన్ని తయారు చేయనున్నట్టు ‘న్యూమన్ స్పేస్’ ప్రకటించింది. ఆరు దశల్లో ఈ ప్రక్రియ పూర్తిచేస్తారు.
- భూ కక్ష్యలో తిరుగుతున్న వ్యర్థ శకలాలను సేకరించడం
- రోబోల సాయంతో వాటిని చిన్న ముక్కలుగా చేయడం
- గరిష్ఠ ఉష్ణోగ్రతల వద్ద వాటిని కరిగించి మెటల్ రాడ్లుగా మార్చడం
- అయనీకరణ ప్రక్రియ ద్వారా ఆ రాడ్లను ఇంధనంగా తయారు చేయడం
- ఈ ఇంధనాన్ని ‘ఇన్-స్పేస్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్’ రాకెట్‌లో నింపడం
- దీని సాయంతో భూ దిగువ కక్ష్యలోని ఉపగ్రహాల వేగం, దిశను మార్చడం